నల్గొండ: నల్గొండ ఎంపీ,రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తాను రామలక్ష్మణుల్లా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇద్దరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. 

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన గుత్తా రాబోయే పంచాయితీ ఎన్నికల్లో అన్ని సర్పంచ్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేలా ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.

పంచాయితీల రిజర్వేషన్లు ఎలా ఉన్నప్పటికీ అన్ని పంచాయితీలు టీఆర్ఎస్ పార్టీకే రిజర్వ్ కావాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ నాయకులు పోటీ పడి ఇద్దరు ముగ్గురు పోటీ చేయవద్దని సూచించారు. సర్పంచ్‌ పదవులు సంపాదించుకోవడానికి కాదని, ప్రజలకు సేవ చేయడం కోసమేనన్నారు. 

సర్పంచ్‌ పదవుల కోసం భూములు అమ్ముకుని నష్టపోవద్దన్నారు. మంచి అభ్యర్థిని ఆయా గ్రామాల్లో నిలబెట్టి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగించిందన్నారు. 

అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్కరికీ జగదీష్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. దేశాన్ని పాలించే శక్తి కేసీఆర్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. 

కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలతో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. 20 ఏళ్లుగా నల్లగొండ నియోజకవర్గంలో అహంకార పూరితంగా వ్యవహరించిన వ్యక్తిని పక్కనపెట్టి కంచర్ల భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్.
 
సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం నల్లగొండను దత్తత తీసుకోనున్నందున ఈ నియోజకవర్గానికి భారీఎత్తున నిధులు రానున్నట్లు తెలిపారు.