టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఆయన కోస్గి వెళ్లారు. అక్కడ ఆయనకు పార్టీ నేతలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.

ప్రశ్నించేవాడు లేకుంటే పాలించేవాడిదే రాజ్యమౌతుందని గుర్తించి ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ కొడంగల్ ప్రజల ఆదరణ, అభిమానాన్ని ఎన్నడూ మర్చిపోనని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి గురించి ఆయన ప్రస్తావించారు. కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా తనను టీఆర్ఎస్ నేత హరీష్ రావు దగ్గరుండి ఓడిపోయేలా చేశారని చెప్పారు. తనను ఓడించిన హరీష్ రావు గత ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. కొడంగల్ ప్రజలకు హరీష్ రావు ద్రోహం చేశారని... అందుకు ఇప్పడు శిక్ష అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.