టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరికాసేపట్లో చంచల్ గూడ జైలుకి వెళ్లనున్నారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌‌ను పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై శనివారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

రవిప్రకాష్ ను తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆయన అరెస్టును డీసీపి సుమతి ధ్రువీకరించారు. టీవీ9లో నిధుల కైంకర్యంపై ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ సొమ్మును రవిప్రకాష్ సొంతానికి వాడుకున్నారని సుమతి చెప్పారు.  

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ లో ఉన్న నిబంధనలను తొలగించాలంటూ రవి ప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. కాగా ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవి ప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.