వాట్సప్ డీపీలతో మార్ఫింగ్.. అశ్లీలంగా మార్చి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు.. ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం..
ఫొటోలను మార్పింగ్ చేసి, అశ్లీలంగా మార్చి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఇద్దరు యువతులు మనస్థాపానికి గురయ్యారు. కాలేజీకి వెళ్తున్నామని చెప్పి, ఇంట్లో నుంచి బయలుదేరి ఓ పార్కులో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ యువతులు ఇద్దరు స్నేహితులు. ఇంటర్ లో మొదలైన స్నేహం డిగ్రీలోనూ కొనసాగుతోంది. అయితే వారిద్దరూ తమ ఫొటోలను వాట్సప్ డీపీలుగా పెట్టుకోవడమే శాపంగా మారింది. ఆ డీపీలను పలువురు దుండగులు తీసుకొని, వాటిని మార్ఫింగ్ చేశారు. ఆ ఫొటోలను అశ్లీలంగా మార్చి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అవి చూసిన విద్యార్థినులు మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్‌పల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల ఇద్దరు విద్యార్థినులు డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ నల్గొండ జిల్లాలోని ఓ హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తుంటారు. వీరిద్దరికి ఇంటర్ మీడియట్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి అప్పటి నుంచి డిగ్రీ వరకు అలాగే కొనసాగుతోంది.
కాగా.. ఇటీవల ఎగ్జామ్స్ పూర్తి కావడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. దీంతో వారిద్దరూ ఎవరింటికి వారు వెళ్లిపోయారు. 20 రోజులుగా ఇంట్లోనే ఉన్న స్నేహితులు.. మంగళవారం కాలేజీలో ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నల్గొండకు వచ్చారు. ఎన్జీ కాలేజీ వెనకాల ఉన్న రాజీవ్ పార్క్ కు వెళ్లి చాలా సేపు అక్కడ కూర్చున్నారు. గంట కంటే ఎక్కువ సమయం అక్కడే గడిపారు. అనంతరం అక్కడే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ దారుణాన్ని హాస్టల్ లో ఉన్న ఓ ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పారు.
తరువాత ఆ పార్క్ నుంచి బయల్దేరారు.. గేటు బయట ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి కుప్పకూలిపోయారు. వారిని స్థానికులు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను హుటాహుటిన నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారిద్దరూ ఐసీయూలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
కాగా.. తమ డీపీలను తీసుకొని మార్పింగ్ చేశారని, వాటిని ఇన్ స్టాలో పోస్టు చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. అందుకే తాము ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్టు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్గొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.