సూర్యాపేట: సూర్యాపేట సమీపంలోని మూసి ప్రాజెక్టు గేటొకటి కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధా అవుతుంది. హైదరాబాద్ పరిసరాల్లో జోరుగా కురిసిన వానలవల్ల మూసి నిండింది. దీనితో ఆయకట్టు రైతులు ఆనందపడ్డారు. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 

నిన్న రాత్రి అనూహ్యంగా డామ్ నిండుగా ఉండడంతో గేట్ కొట్టుకుపోయింది. హుటాహుటిన డాం ఇంజినీర్లు దిగువనున్న ప్రాంతాలను అప్రమమత్థం చేసారు. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుండి ఒక స్పెషలిస్ట్ బృందం సంఘటనాస్థలానికి చేరుకుంది. 24గంటలుగా నీరంతా వృధాగా పోతుంది. 

నేటి ఉదయం మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఇక్కడ పర్యటించారు. అధికారులను అడిగి మరీ అన్ని విషయాలు తెలుసుకున్నారు. వచ్చిన ప్రత్యేక ఇంజినీర్లతోని కూడా మాట్లాడి సాధ్యమైనంత తొందరగా పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. 

నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్ట్ గేట్లను మార్చారు. కేవలం నాలుగు సంవత్సరాలకే ఇలా గేట్లు కొట్టుకుపోవడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈపాటికే కొత్త గేటు కోసం ఆర్డర్ ఇచ్చారని సమాచారం. కేవలం కొట్టుకుపోయిన ఒక్క గేటే కాకుండా మిగిలిన గేట్లను కూడా మార్చనున్నారు. వాటికి కూడా ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.