హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో ఆయన పేరు తెలియనివారుండరు. ముక్కు సూటిగా మాట్లాడటం ఆయన నైజం. క్రమశిక్షణకు మారుపేరు. నైతిక విలువల విషయానికి వస్తే అవతలి వ్యక్తి ఎంతటి పెద్దవారైనా ఊరుకోరు. తన మనసులో ఉన్నది చెప్పేస్తారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు ఆయనే విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. 

మోహన్ బాబుకి తెలుగు సినీచరిత్రలో ప్రత్యేక గుర్తింపు.  అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ మోహన్ బాబును టచ్ చేసే సాహసం చెయ్యరనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తన రూటే సెపరేటు అనే మోహన్ బాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన సెపరేట్ రూట్లో ట్విట్లర్ వేదికగా పలు పంచ్ డైలాగులు వేస్తున్నారు. 

ఈ పంచ్ డైలాగులు గురించి ఆలోచిస్తే కొందరి గూబ గుయ్ మనేలా ఉంటాయి. మరోకరిని హత్తుకునేలా ఉంటాయ్. ఇకపోతే తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ సెప్టెంబర్ 6న రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే సినీరంగానికి చెందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ డైరెక్ట్ గానే టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి బహిరంగంగా తమ మద్దతు ప్రకటించారు. 

అయితే సెప్టెంబర్ 6 తర్వాత మోహన్ బాబు తన ట్విట్టర్ వేదికగా భారీ పంచ్ డైలాగులు వేస్తున్నారు. అయితే అవి నేరుగా వెయ్యకుండా తన సినిమాలోని పాపులర్ డైలాగులను రోజుకొకటి పెడుతున్నారు. 

అయితే మోహన్ బాబు పోస్ట్ చేసే డైలాగులు ప్రస్తుత రాజకీయాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇంకాస్త విశ్లేషిస్తే రాజకీయాలను తూర్పారబట్టే విధంగానే ఈ డైలాగులు ఉన్నాయి. తన సినిమాలో రాజకీయాల నేపథ్యంలో వాడిన డైలాగులను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేడిని టచ్ చేసేలా పోస్ట్ చేస్తున్నారు. 

2018 సెప్టెంబర్ 10న తన ట్విట్టర్లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఓ డైలాగ్ ను పోస్ట్ చేశారు. పుణ్యభూమి నాదేశం సినిమాలో పాపులర్ డైలాగ్ అయిన భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్ను న్నాయో, డబ్బు సంపాదించడానికి బేవర్సు రూట్లన్నున్నాయి అంటూ ట్వీట్ చేశారు. ఆ సమయంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలకు సంబంధించి పూజలు చేస్తున్న రోజులవి. 

ఇకపోతే 2018 అక్టోబర్ 15న మరో డైలాగ్ ను ట్వీట్ చేశారు. ఒకప్పుడు నాలుగు మెట్లు కిందున్నానన్నావే. ఇప్పుడేమంటావ్..? నీకన్నా ఎన్నిమెట్లు పైనున్నానో చెప్పు..చూద్దాం. అంటూ పొట్టేలు పున్నమ్మ చిత్రంలోని డైలాగ్ ను పొందుపరిచారు. 

అటు అక్టోబర్ 29న పదేపదే బాబు వచ్చేలా ఓ సినీ డైలాగును ట్వీట్ చేశారు. రాంబాబు రాయలసీమకే బాంబుబే, మా వీధిలో రాముడి గుడుంది. ఆయనకంటే గొప్పవాడివా అన్నాడొకడు.. నేను ఆయన బాబునిబే. కనుక నేను రాంబాబునిబే అన్నాను.. రేపు సాయి బాబుని.. ఎల్లుండి కృష్ణబాబుని. ఆ తర్వాత బాబులకి బాబుని అంటూ రౌడీగారి పెళ్లాం సినిమాలోని మాంచి డైలాగును ట్వీట్ చేశారు. 

 

ఇటు నవంబర్ 19న మరో పంచ్ డైలాగ్ ట్వీట్ చేశారు. తన హిట్ సినిమా అయిన అడవిలో అన్న చిత్రంలో ఓ పాపులర్ డైలాగ్ ను మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఏం చేస్తావ్.. బెదిరిస్తావా..? రజాకార్లను.. తరిమికొట్టిన తల్లికి పుట్టానురా నేను.. దేశాయ్ లను దేశముఖ్ లను తెగనరికిన తండ్రికి పుట్టానురా నేను..పేదవాడి చెమటతో తడిసిన భూమిలో మొలిసిన మొక్కకు పూసిన ఎర్ర గులాబీ నేను అంటూ సమాజాన్ని చైతన్యవంత పరిచేలా పంచ్ డైలాగులు ట్వీట్ చేశారు.


 
మరోవైపు డిసెంబర్ 3న మరో అద్భుత డైలాగ్ ను ట్వీట్ చేశారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. నీ కంటికి నేనొక్కడినే కనిపించొచ్చు. కానీ నా పక్కన మేధావులున్నారు. ఐ.ఏ.యస్. ఆఫీసర్లున్నారు. ఐ.పి.యస్.లున్నారు. బడుగు-బలహీన వర్గాలున్నారు. వాళ్ళందర్నీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను అంటూ కలెక్టర్ గారు సినిమాలోని డైలాగును ట్వీట్ చేశారు.  ఈ డైలాగ్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 

2018 డిసెంబర్ 6న ఐశ్వర్యం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. మతం మనిషిని పశువుని చేస్తుంది అంటూ 2000లో నటించిన పోస్ట్ మాన్ సినిమాలోని డైలాగ్ ను మోహన్ బాబు ట్వీట్ చేశారు. 

ఇలా వరుస ట్వీట్లతో మోహన్ బాబు ఆకట్టుకుంటున్నారు. వాస్తవానికి మోహన్ బాబు తాను నటించిన సినిమాలోని పాపులర్ డైలాగులు అయినప్పటికీ రాజకీయాలకు సంబంధం ఉన్న డైలాగులు కావడంతో మోహన్ బాబు ట్వీట్లపై సర్వత్రా ఆసక్తి కనబరుస్తున్నారు నెటిజన్లు. 

అయితే శుక్రవారం డిసెంబర్ 7న పోలింగ్ సందర్భంగా ఏ డైలాగ్ ట్వీట్ చేస్తారో...ఫలితాల రోజున ఇంకెలాంటి ట్వీట్ చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతా మోహన్ బాబు ట్వీట్ పై ఆసక్తిగా చూస్తున్నారు. మెుత్తానికి మంచు మోహన్ బాబు పంచ్ డైలాగులు హాట్ టాపిక్ గా మారాయన్నమాట.