తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకులంతా ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తూ.. తమ ప్రచారాన్ని హుషారుగా సాగిస్తున్నారు. కాగా.. మజ్లిస్ నేత జాఫర్ హుసేన్ మాత్రం.. తన ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి.. ఏడ్చుకుంటూ స్టేజీ దిగి వెళ్లిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... నాంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, మజ్లీస్ నేత జాఫర్ హుసేన్ కి పార్టీ తరపు నుంచి ఈ ఎన్నికల్లోనూ టికెట్ లభించింది. దీంతో.. ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే.. గత కొంతకాలంగా జాఫర్ చిన్న కొడుకు మక్సూద్ హుస్సేన్(32) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 

అయితే.. ఇటీవల జాఫర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించిందనే సమాచారం వచ్చింది.దీంతో.. షాక్ కి గురైన జాఫర్.. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి ఏడ్చుకుంటూ కుమారుడి దగ్గరకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ప్రచారాన్ని సైతం వదిలేసి.. ఆస్పత్రిలో కొడుకు వద్దనే ఉన్నాడు.

అయితే.. ఎన్నికల ప్రచారం సంగతి తాము చూసుకుంటామని పార్టీ నేతలు ఆయనకు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో ఆయన నిశ్చితంగా కొడుకు బాగోగులు చూసుకుంటున్నారు.