కేటీఆర్ ను కాదు ఈటలను సీఎం చేయాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్
సీఎం పదవి బడుగు బలహీన వర్గాల నాయకులకు ఇస్తే తప్పేంటని ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
మహబూబాబాద్: తన తనయుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబేట్టాలని సీఎం కేసీఆర్ రంగంసిద్దం చేశారని ప్రచారం జరుగుతోందని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ గుర్తుచేశారు. అలాకాకుండా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుడు, అనుభవజ్ఞుడయిన మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం చేయాలని... అందులో తప్పేముందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితున్ని సీఎం చేస్తానని చెప్పి రాష్ట్ర అవతరణ అనంతరం కేసీఆరే సీఎం అయ్యారని... ఇప్పుడు కొడుకును సీఎం చేయాలని చూస్తున్నాడన్నారు. సీఎం పదవి బడుగు బలహీన వర్గాల నాయకులకు ఇస్తే తప్పేంటని సుధాకర్ ప్రశ్నించారు.
గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటలను ముఖ్యమంత్రి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ''ఈటల ఏం తక్కువ చేశారు? కేటీఆర్ ఏం ఎక్కువ చేశారు? సీఎం కుమారుడే సీఎం కావాలా? దళితుడిని సీఎం చేస్తే ఏమవుతుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటి?'' అని బండి సంజయ్ ప్రశ్నించారు.
read more కేటీఆర్ కాబోయే సీఎం.. మేయర్ బొంతు రామ్మెహన్
మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎస్ లో అణుబాంబు కంటే భారీ పేలుడు జరగడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్‌ను సీఎంను చేయడానికి కేసీఆర్ మూడు రోజులపాటు దోష నివారణ పూజలు చేశారని, ఆ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలిపేందుకే ఇటీవల కాళేశ్వరం వెళ్లారని అన్నారు. ఫాంహౌస్ లో ఈ పూజలు మూడురోజులు జరిగాయని, శృంగేరి నుంచి ప్రత్యేకంగా పూజారులను రప్పించారని తెలిపారు.
ఇలా ఓవైపు ఐటీ మంత్రి కేటీఆర్ కు పట్టం కట్టేందుకు సీఎం కేసీఆర్ అన్నీ సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో మరో మంత్రి ఈటలకు మద్దతు పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులతో పాటు ప్రత్యర్థి పార్టీలు సైతం ఈటలను సీఎం చేయాలన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.