ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 19వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించనిది సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో...రవాణా సదుపాయం లేక ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. అయితే... ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాల్సిందిగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్  జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిచి వస్తే... వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తాను సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుంటానని ఆయన చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెను వాడుకొని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీల ప్రోత్సాహంతో కార్మికులు ఆందోళనకు దిగారని... ఇది సరైంది కాదని చెప్పారు. 

ఇదిలా ఉండగా... భుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర డిమాండ్ల పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకొన్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ల పరిష్కారం కోసం ఈడీలతో ఆర్టీసీ ఎండీ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. కోర్టు ఆదేశాల మేరకు ఆ  డిమాండ్లు పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఆ దిశగా  అధ్యయనం చేయండి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

 ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు.  ఈ కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి. వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఈడీ లు ఎ. పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్ లు సభ్యులుగా ఉంటారు.

హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుంది.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్భలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు మద్దతు పలకడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని సిఎం ప్రశ్నించారు.