గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టుగా ప్రచారం సాగుతన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టుగా ప్రచారం సాగుతన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. బీజేపీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. టీడీపీలో చేరుతానన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున గోషామమల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. తన మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదని అన్నారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. తనపై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేస్తారనేది తెలియదని చెప్పారు. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రులు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. 

ఇక, మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గతేడాది రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడి 8 నెలలు దాటిపోయింది. అయితే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ క్రమంలోనే రాజాసింగ్ బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. తొలినాళ్లలో తనకు రాజకీయ అవకాశం కల్పించిన తెలుగుదేశం వైపు రాజాసింగ్ చూస్తున్నారని.. ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. అయితే రాజాసింగ్ తాజాగా ఆ వార్తలను ఖండించారు. 

ఇక, రాజాసింగ్‌ 2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే 2014 ఎన్నికలకు బీజేపీలో చేరిన రాజాసింగ్.. గోషామహల్ నుంచి బరిలో నిలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మరోమారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వివాదస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారనే అభిప్రాయం ఉంది.