నల్గొండ: పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి అమ్ముడు పోయే పిరికివాళ్లం కాదన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌నే కాంగ్రెస్ లో చేర్పిస్తామని చెప్పుకొచ్చారు. 

నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం జరిగిన నియోజకవర్గస్థాయి కాంగ్రెస్‌ కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ను వీడి అధికార టీఆర్‌ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తనపై వస్తున్న ప్రచారాలను రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. 

తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నమ్ముకున్న ప్రజల ఆకాంక్షల సాధన కోసం నీతిగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవలేదని, కేవలం ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే విజయం సాధించారని కోమటిరెడ్డి ఆరోపించారు.