తన ఆరు ఆవులను ఎవరో దొంగిలించి మూడు నెలలు గడుస్తున్నా ఆచూకీ దొరకలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పుకొచ్చారు. ఆవులను దొంగిలించే ముఠా గుట్టు రట్టు చేయాలని మరోసారి డీజీపీకి విజ్ఞప్తి చేశారు.  

2020 అక్టోబర్ లో తన ఆరు ఆవులు దొంగిలించబడ్డాయని, ఇది జరిగి ఇప్పటికే మూడు నెలలు అయిపోయిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను నిత్యం పూజించే ఆవు కూడా దొంగిలించబడిన ఆవుల్లో ఉందని తెలిపారు. ఈ మేరకు ఆ ఆవుతో జగ్గారెడ్డి దిగిన ఫోటోను విడుదల చేశారు. 
ఆవులను దొంగలించ బడడంతో ఇంట్లో  దూడలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చారు. పోలీసులు వెతుకుతున్నా ఇంకా దొరకలేదన్నారు.  

ఆవులను దొంగతనం చేసిన వారిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని...ఎమ్మెల్యే అయి ఉండి కూడా ప్రేమతో పెంచుకున్న ఆరు ఆవులు దొంగిలించినా ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. 

ఆవులను మేత కోసం వదిలితే దొంగలు కబేళాలకు తరలిస్తున్నారని, తన ఆవులే కాదు సంగారెడ్డి లో చాలా ఆవులు, ఎడ్లు దొంగలించబడ్డాయన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థదేనని, డీజీపీని మరోసారి కోరుతున్నానని..దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.