కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఎప్పుడు ఎవరు.. ఈ మహమ్మారికి బలౌతున్నారో ఎవరికీ తెలియడం లేదు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతే.. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలోనూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వృద్ధురాలి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించారు. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండలోని పాతబస్తీ వంటిస్తంభం ప్రాంతానికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన కాంచనపల్లి భారతమ్మ (70) కరోనాతో మృతి చెందింది. మనుమరాలు సుమలత, ఆమె భర్త బొల్లోజు దుర్గాప్రసాద్, కుమారుడు మహేశ్కు ఈనెల 3వ తేదీన కరోనా పాజిటివ్‌ రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. గురువారం వృద్ధురాలు భారతమ్మను స్థానిక కౌన్సిలర్‌ ఎడ్ల శ్రీనివాస్‌ అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తానుండలేనంటూ భయానికే ఇంటికి తిరిగి వచ్చి శుక్రవారం ఉదయం మరణించింది.

కరోనాతో భయంతో ఉన్న కుటుంబానికి అంత్యక్రియలు చేయడం మరింత క్లిష్టంగా మారింది. దీంతో కౌన్సిలర్‌ శ్రీను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వృద్ధురాలికి హిందూపూర్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు కరోనాతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అంతా తానై అంత్యక్రియలు పూర్తి చేశారు. అవసరమైన మందులు , నిత్యావసర సరుకులను అందిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.