తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు అందించడంలో ముఖ్య వనరుగా వున్నచెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. అన్నదాతల కోసం జరుగుతున్న ఈ బృహత్తర పథకం ఇప్పటికే అనేక అవార్డులను కైవసం చేసుకోగా తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యింది.

రాష్ట్రంలో సాగునీటి వనరులు వినియోగం, నిర్వహణతో పాటు మిషన్ కాకతీయ పనితీరు, దాని వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాల ఆదారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు అవార్డుకు ఎంపిక చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డ్ కు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖను ఎంపిక చేసింది. ఇవాళ ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న నీటి పారుదల సీఈ శ్యాంసుందర్ కేంద్ర మంత్రి గడ్కరీ చేతులమీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. 

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. చిన్న నీటి పారుదల ఎక్కువగా చెరువులపైనే ఆధారపడింది. అయితే ఉమ్మడి పాలనలో చెరువుల పరిస్థితి అద్వాన్నంగా మారిందని గుర్తించిన ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది.

ప్రతి ఏడాది వర్షాకాలానికి  ముందు ఎంపిక చేసిన చెరువుల్లో పూడిక తీయడం... ఆ మట్టిని రైతులు పొలాల్లో చల్లుకోడానికి ఉచితంగా అందించింది. ఇలా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నం సఫలమై ఇతర రాష్ట్రాల ఆదర్శంగా నిలిచింది.