అభం శుభం తెలియని ఓ మైనర్ బాలిక రోడ్డుపై వెళుతుండగా ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు రక్షణ మాత్రం లభించడంలేదు. నిత్యం ఏదోఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ మైనర్ బాలిక గంజాయి మత్తులో తూగుతున్న ఓ సైకో చేతిలో అత్యాచారానికి గురయ్యింది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో మైనర్(13) బాలిక కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అయితే నిన్న(గురువారం) రాత్రి 8 గంటల సమయంలో పనిపై బయటకు వచ్చిన బాలిక వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద నడుచుకుంటూ వెళుతుండగా ఓ కామాంధుడి కంటపడింది. అప్పటికే గంజాయి మత్తులో వున్న యువకుడు బాలిక ఒంటరిగా వుండటాన్ని గుర్తించాడు. దీంతో చిన్నారిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
read more మైనర్ బాలుడితో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని..
రాత్రంతా బాలికను తనవద్దే వుంచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు దుండగుడు. ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆ బాలికను వదిలిపెట్టాడు. ఇంటికి చేరుకున్న చిన్నారి తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు మరో ఇద్దరిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనలో వారి ప్రమేయం కూడా ఏమైనా వుందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది.
