రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేములవాడలో బాలికకు మాయమాటలు చెప్పి సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళితే... వేములవాడ మండలానికి చెందిన బాలికకు గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన సాయి ఆమెకు మేనబావ అవుతాడు.

ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని బాలికను లోబరుచుకున్న సాయి.. గత కొంతకాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న సాయి ఆదివారం తన తల్లితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా  బాలికకు గర్భం తీసేందుకు సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి మాత్రం వేయించాడు.

దీంతో విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపడంతో వారు ఆసుపత్రికి వచ్చి గొడవకు దిగారు. బాలికను వివాహం చేసుకోవాలని సాయిని నిలదీశారు. అయితే యువకుడు అందుకు ఒప్పుకోలేదు.. దీంతో బాలిక తల్లిదండ్రులు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.

ఆ సమయంలో బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పక్కనే వున్న సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లింది. అక్కడే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెకు అబార్షన్ అయ్యింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు సాయిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.