నిన్న రాత్రి నుండి కనిపించకుండా పోయిన 17ఏళ్ళ యువతి తెల్లవారేసరికి ఓ నిర్మాణ భవనంలో శవమై తేలింది. ఈ దారుణం తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: నిన్న(సోమవారం) రాత్రి నుండి కనిపించకుండా పోయిన యువతి మంగళవారం తెల్లవారుజామున శవమై కనిపించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతంలో చోటుచేసుకుంది. యువతిది కేవలం హత్యేనా లేక అత్యాచారం చేసి హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని పారిశ్రామికవాడ జీడిమెట్ల సుభాష్ నగర్ లో 17ఏళ్ళ బాలిక కుటుంబంతో కలిసి నివాసముండేది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళిన యువతి రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.

ఇలా రాత్రంతా వెతకగా ఇవాళ తెల్లవారుజామున జీడిమెట్లలోనే పైప్ లైన్ రోడ్డులో బాలిక మృతదేహం లభించింది. నిర్మాణంలో వున్న ఓ భభవనంలో బాలిక మృతదేహం రక్తపుమడుగులో పడివుంది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందిన వెంటనే జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువతి మృతదేహాన్ని చూస్తే అత్యాచారం చేసి ఆ తర్వాత హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి బాలిక ఎవరితో కలిసి వెళ్లిందనేది తెలుసుకునేందుకు ఇంటివద్ద మరియు ఘటన జరిగిన భవనానికి సమీపంలోని సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలికను అంత దారుణంగా చంపడానికి కారణాలేంటో నిందితుల అరెస్ట్ తోనే తేలనుంది. 

ఇక ఇలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఓ మామిడితోటలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ప్రియుడితో సరదాగా గడపడానికి బయటకు వెళ్లిన యువతి వాలెంటైన్స్ డే రోజునే ఇలా శవంగా మారింది. ఆదివారం రాత్రి యువతి కనిపించకుండా పోగా సోమవారం మృతదేహం లభించింది. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... మృతురాలు ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చిన తల్లి కూతురు లేకపోవడంతో మ‌రో వ్య‌క్తి సాయం తీసుకొని కూతురును వెతికింది. ఊర్లోని చుట్టాలు, తెలిసి వారి ఇళ్ల‌లోకి వెళ్లి కూతురు జాడ కోసం వెతికింది. కానీ క‌నిపించ‌లేదు. 

అయితే సోమవారం హుగ్గేలి స‌మీపంలోని మామిడితో తోట‌లో యువ‌తి మృత‌దేహం లభించింది. స్థానికులు తోటలో యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమృతదేహం తన కూతురిదేనని తల్లి గుర్తించి బోరున విలపించింది. 

మృతురాలు జ‌హీరాబాద్ లోని ఓ కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతోంద‌ని గుర్తించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఎక్కడ ఈ విషయం బయటపెడుతుందోనని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జహీరాబాద్ పోలీసులు ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.