తన ఫోటోని ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడనే బాధతో ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బొమ్మలరామారం మండలం  బోయిన్ పల్లి గ్రామానికి చెందిన సాభావత్ శిల్ప(14) మూడు చింతల పల్లి మండలం పోతారం గ్రామంలో కూరగాయల తోటలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

కొంతకాలం క్రితం బాలికకు మండలంలోని బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గల సన్నిహితం రోజు రోజుకీ పెరిగింది. బాలికను సదరు యువకుడు ఇష్టపడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. తమ మధ్య చనువుతో బాలిక ఫోటోని యువకుడు తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు.

ఈ విషయంలో బాలిక చాలా కలత చెందింది. ఆ ఫోటో చూసి తనను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే భయంతో..తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నారి తన పనిచేసే తోటలో గల పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మధు వేధింపులతోనే తన కూతురు శిల్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.