ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. తుమ్మల నాగేశ్వర్ రావు‌ను ఓడించి ఉపేందర్ రెడ్డి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల ఈ నియోజకవర్గంలో ఓటమి పాలు కావడం ఆ పార్టీ నేతలను షాక్ గురిచేస్తున్నాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుండి  తుమ్మల నాగేశ్వర్ ‌రావు  టీఆర్ఎస్ లో చేరారు.

ఎమ్మెల్సీగా ఎన్నికై కేసీఆర్ మంత్రివర్గంలో  తుమ్మల నాగేశ్వర్ రావు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో పాలేరు నుండి విజయం సాధించి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకట్ రెడ్డి  మృతితో  పాలేరు నుండి తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఈ దఫా ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వర్ రావు  పోటీ చేశారు. అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల నాగేశ్వర్ రావు ఓటమి పాలయ్యారు.

2014 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా  తుమ్మల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.పాలేరు నుండి పోటీ చేయాలని ఆ సమయంలో తుమ్మల నాగేశ్వర్ రావు ప్లాన్ చేసుకొన్నారు. ఆ సమయంలో  నామా నాగేశ్వర్ రావు  తన వర్గానికి చెందిన ఎంబీ స్వర్ణకుమారికి పాలేరు నుండి టిక్కెట్టు ఇప్పించారు. దీంతో ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు.

టీఆర్ఎస్ లో చేరిన తర్వాత పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎమ్మెల్యే  పువ్వాడ అజయ్ కుమార్ ను టీఆర్ఎస్ లో తుమ్మల నాగేశ్వర్ రావు చేర్పించారు.

ఖమ్మం జిల్లాలోని పలు ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో తుమ్మల నాగేశ్వర్ రావు కీలకంగా వ్యవహరించారు.ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.