ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు వుంటుందని, అందువల్ల ఎవ్వరూ ఇల్లు అమ్ముకోవద్దన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. 

ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అమ్ముకోవద్దని లబ్ధిదారులకు సూచించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గోషామహల్‌లోని ముర్లిధరబాగ్‌లో ప్రభుత్వం నిర్మించిన 120 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీలు అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఇలాంటి ఇల్లు జీవితంలో వస్తుందని జనం ఊహించి వుండరని అన్నారు. ఇక్కడి స్థానికులు పళ్లు, పువ్వులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని.. మీ పిల్లలను బాగా చదివించాలని తలసాని సూచించారు. 

ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మార్చివేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు వుంటుందని, అందువల్ల ఎవ్వరూ ఇల్లు అమ్ముకోవద్దన్నారు. పెన్షన్ అందని వారికి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తలసాని స్పష్టం చేశారు. ఇక్కడ కట్టిన దుకాణాలను స్థానికులకే ఇస్తామని, లాటరీ పద్ధతిలో దుకాణాలు అందిస్తామన్నారు. 

ALso Read: ధాన్యం కొనుగోలు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల నమ్మొద్దు : రైతాంగానికి మంత్రి ఎర్రబెల్లి సూచన

అంతకుముందు కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఏం మాట్లాడతారో తెలియదన్నారు. 60 ఏళ్లకు ముందు తెలంగాణ ఎలా వుండేది, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా వుందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నదే కేసీఆర్ అభిమతమన్నారు. అందుకే ఆయనే స్వయంగా పర్యటనలు చేస్తున్నారని దయాకర్ రావు తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో వున్న ఛత్తీస్‌గఢ్‌లో రైతులకు 5 వేల నష్టపరిహారం కూడా ఇవ్వలేదని.. తెలంగాణలో మాత్రం ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. వర్షాలకు ధాన్యం పాడవకుండా వుండేందుకు గాను 1.30 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు పూర్తి చేశారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు. తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని.. కాంగ్రెస్, బీజేపీల దొంగ మాటలను నమ్మొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.