హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతుంది. 

ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చకచకా చేస్తుంటే సీఎల్పీ నేత మాత్రం ప్రాజెక్టు ఎక్కడ పూర్తయ్యిందంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కేవలం 15 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. 

మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. విక్రమార్క తెలివి ఉండే మాట్లాడుతున్నారా లేక తెలివిలేక మాట్లాడుతున్నారా అంటూ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు పనులపై అనుమానాలు ఉంటే ఒకసారి స్వయంగా తిరిగి పర్యవేక్షించాలని సూచించారు. 

అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ దోపిడీకి పాల్పడిందంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.