సనత్‌నగర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్‌ నివాసం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులు హంగామా సృష్టించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో టీడీపీ తరపున వెంకటేశ్ గౌడ్, టీఆర్ఎస్ తరపున మంత్రి తలసాని బరిలో నిలిచారు.

మంగళవారం విడుదలైన ఫలితాల్లో తలసాని విజయం సాధించగా.. కూన ఓటమి పాలయ్యారు. ఫలితాల తర్వాత శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులు వెంకటేశ్ గౌడ్ నివాసం వద్దకు చేరుకుని టపాసులు పేల్చడంతో పాటు అసభ్యపదజాలంతో దూషించారు.

దీనిపై స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. దీనిని వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు మంత్రి కేటీఆర్‌కు సైతం పంపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తలసాని మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బేగంపేటలోని బ్రాహ్మణవాడీలో గల కూన వెంకటేశ్ గౌడ్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. తమ వారు చేసిన హంగామా గురించి తనకు తెలియదని.. వారిని మందలిస్తానని తెలిపారు. అనంతరం వెంకటేశ్ గౌడ్ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.