సారాంశం

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 

మహబూబ్ నగర్ : తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సొంత నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రజలు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పీడిత వర్గాల కోసం పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆనాటి దొరల అమానుషాలను ప్రశ్నించడమే కాదు ఎదురుతిరిగిన మహిళ ఐలమ్మ అని అన్నారు. పేదల పంటలను , పశు సంపదను బలవంతంగా ఎత్తుకెళ్లడం... ఆడవారిపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్న దొరలను ఐలమ్మ ధైర్యంగా ఎదిరించారని... అందువల్లే ఆమెను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామని అన్నారు. ఆమె ధైర్యాన్ని పునికిపుచ్చుకుని నేటి మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 

చాకలి ఐలమ్మతో పాటు తెలంగాణ పోరాటయోధులు, మహనీయుల విగ్రహాలను మహబూబ్ నగర్ గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటుచేసుకోవడం ఆనందదాయకమన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త్వరలోనే సేవాలాల్ మహరాజ్, భగీర మహర్షి విగ్రహాలను కూడా గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగు రెండు కోట్లు యాభై లక్షల రూపాయలతో గ్రీన్ బెల్ట్ ను సుందరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. 

Read More  ''సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ..''

ఇక ఐలమ్మ కులానికి చెందిన రజకులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందని మంత్రి  తెలిపారు. రజకుల ఇస్త్రీ షాపులకు 250 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ ఇస్తోందన్నారు. అలాగే మహబూబ్ నగర్ లో కోటి రూపాయలతో అధునాతన వాషింగ్ మిషన్లు, డ్రయ్యర్లు ఏర్పాటుచేసామని... అవసరం అయితే మరో నాలుగైదు యూనిట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులోనూ రజకులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.