తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ కౌంటరిచ్చారు. తమకు 100కు పైగా ఎమ్మెల్యే బలం వుందని.. అలాంటప్పుడు  టీఆర్ఎస్ సర్కార్‌ని కూల్చలేరని ఆమె వ్యాఖ్యానించారు. 

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోన్నాయి. వీటిపై టీఆర్ఎస్ (trs) నేతలు, మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod) గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. గవర్నర్ తల్చుకుంటే.. ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించడం సరికాదని సత్యవతి అన్నారు. వందకు పైగా ఎమ్మెల్యేల బలం వున్న టీఆర్ఎస్ సర్కార్‌ను ఎలా కూలుస్తారని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గవర్నర్ ఆంతర్యం తెలంగాణ ప్రజలకు అర్ధమైందని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించినట్లుగా తమిళిసై మాట్లాడారంటూ సత్యవతి ఎద్దేవా చేశారు. 

ఇక గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనను ఇబ్బంది పెడుతున్నామని Governor చెప్పారని తాను విన్నానన్నారు. కానీ Narasimhan గవర్నర్ గా ఉన్న సమయంలో తమకు ఏనాడూ ఇబ్బంది రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తమను ఇబ్బంది పెట్టినందుకు గాను ప్రస్తుతం ఆమెను మేం ఇబ్బంది పెడుతున్నామని గవర్నర్ అనడం సరైంది కాదన్నారు. గవర్నర్ కాక ముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసునన్నారు.

గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ సమయం వచ్చినప్పుడల్లా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పేరుకు సిపారస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి. 

రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు.ఈ సంబరాలకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపింది. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు.ప్రోటోకాల్ పాటించలేదు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఉగాది సంబరాల సమయంలో తాను ఎవరికీ కూడా తల వంచబోనని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.