తెలంగాణలో ‘‘ఉచిత విద్యుత్’’ మంటలు ఇంకా కొనసాగుతూనే  ఉన్నాయి. తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణలో ‘‘ఉచిత విద్యుత్’’ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కాంగ్రెస్‌కు పట్టవని విమర్శించారు. గతంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని.. అదే ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలోవ్యవసాయం పండగలా మారిందని చెప్పారు. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ విద్యుత్ అంశంపై లేఖ రాశారని.. విద్యుత్ చార్జీల పెంపును తొలుత విభేదించింది కేసీఆరేనని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యుత్ అంశం కీలకమైనదని అన్నారు. చరిత్ర తెలియని వాళ్లు ఏదేదో మాట్లాడతారని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పేరుకే 9 గంటల ఉచిత విద్యుతు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 24 గంటల విద్యుత్ సాధ్యం కాదని గతంలో కాంగ్రెస్ నేతలే అన్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యం చేసి చూపిస్తుందని చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేకపోతుందని విమర్శించారు.

ఉచిత విద్యుత్‌పై అవగాహన లేని నేతలే సబ్‌స్టేషన్ దగ్గరకు వెళ్లి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మామూళ్ల కోసమే కరెంట్ కొనుగోళ్లు చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు విద్యుత్ అందుబాటులో ఉందని చెప్పారు. ఆన్‌లైన్ టెండర్‌తో పారదర్శకత ఉంటుందని.. అలాంటప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.