హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంతో మాదాపూర్‌ - జూబ్లీ హిల్స్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించింది.

తాజాగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మరో ప్రాజెక్టు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రానుంది. రూ.66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.

దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి వస్తే కూకట్‌పల్లి-హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీని వల్ల ఐటీ ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది.

ఈ మార్గంలో లాక్‌డౌన్‌కు ముందు ప్రతినిత్యం 5 నుంచి 6 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. కాగా, ఇప్పటికే స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా మొదటి దశలో గచ్చిబౌలి నుంచి జేఎన్‌టీయూ వరకు చేపట్టిన పలు ఫ్లై ఓవర్‌లు, అండర్ పాస్‌లు.. బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ జంక్షన్‌‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.    

హైటెక్ సిటీ ఆర్‌యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరద నీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. దీంతో అండర్ బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. ఇక, భారీ వర్షాలు పడితే అక్కడి పరిస్థితులు దారుణంగా వుండేవి.

ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట్ సర్కిల్‌లో నాటిన హరితహారం మొక్కలకు తరలించనున్నారు.

ఇప్పటికే దాదాపు రూ.1,010 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఈ తరహా 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. రూ.4,741.97 కోట్ల వ్యయంతో చేపడుతున్న మరో 20 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.