ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకురాలేని బీజేపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను మూలన పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వున్న బెంగళూరులో కూడా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. మరి అక్కడ ఐటీఐఆర్ రాకపోవడానికి తమ ప్రభుత్వమే కారణమా అని మంత్రి ప్రశ్నించారు.

2014 నుంచి కేంద్రానికి రాసిన లేఖలు, సమర్పించిన డీపీఆర్‌లు బండి సంజయ్‌కి ఇస్తామని, దమ్ముంటే ఐటీఐఆర్ లేకుంటే దానికి సమానమైన ప్రాజెక్ట్‌ను తీసుకురాగలరా అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

కాగా, ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌పై బండి సంజయ్ నిన్న సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్లే తెలంగాణకు ఐటీఐఆర్ రావడం లేదని లేఖలో పేర్కొన్నారు.

రోజుకొక ఉత్తరం రాస్తూ తప్పుని కప్పి పుచ్చుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. రైల్వే, ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లు అభివృద్ది చేస్తే ప్రాజెక్ట్‌లు కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా వుందని చెప్పారు. దీనికి కౌంటర్‌గా కేటీఆర్ స్పందించారు.