తెలంగాణ ఎన్నికలు త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  కాగా.. మంత్రి కేటీఆర్ నోటా ట్విస్ట్ ఇచ్చారు. ఏ పార్టీ అభ్యర్థి నచ్చకపోతే.. నోటాకి ఓటు వేయమని ఆయన స్వయంగా చెప్పడం గమనార్హం. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, మంచివారిని ఎన్నుకునే అవకాశం మనచేతుల్లోనే ఉందని  కేటీఆర్‌ అన్నారు. 

గురువారం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించుకోవాలన్నారు. ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకైనా ఓటేయాలని కేటీఆర్‌ సూచించారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్‌లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఎన్నో దుష్ప్రచారాలు చేశారని కేటీఆర్‌ విమర్శించారు. సీమాంధ్రులను హైదరాబాద్‌ నుంచి పంపించేస్తారంటూ అపోహలు సృష్టించారన్నారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసుందామని తాము ఆనాడే చెప్పామని ఆయన స్పష్టం చేశారు. 

నాలుగున్నరేళ్ల కాలంలో ఏ వర్గంపైనా వివక్ష చూపలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐటీ రంగం ఊపందుకుందని, గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, అమేజాన్‌ వంటి సంస్థలు వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును అధిగమించి.. హైదరాబాద్‌ను నెంబర్‌వన్‌గా మార్చడమే తమ లక్ష్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు.