కేసీఆర్ సార్‌ను నమ్ముకుని వరి ధాన్యం పండిస్తున్నామని ఓ రైతు మంత్రి జగదీశ్ రెడ్డితో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రైతుకు వ్యవసాయంలో కొన్ని సూచనలు చేశారు జగదీశ్ రెడ్డి.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో (paddy procurement) పాటు వరి వేయొద్దంటూ రైతులను టీఆర్ఎస్ (trs) ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ రైతు తాను కేసీఆర్‌ను నమ్ముకుని వరి వేశానంటూ మంత్రి జగదీశ్ రెడ్డితో (minister jagadish reddy) చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో (gadari kishore) కలసి మహబూబాబాద్‌కు వెళ్లి వస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా తిరుగు ప్రయాణంలో ఎర్రపాడు క్రాస్ రోడ్ వద్ద పొలుమల్లకు చెందిన రైతు సొప్పరి ఏసు పొలం నుండి వస్తున్నాడు. అతనిని చూసిన మంత్రి జగదీష్ రెడ్డి తన కాన్వాయిని అపి రైతుతో ముచ్చటించారు. దిగుబాటు పొలాలు అయితే వరి వెయ్యాలి చక్కగా .. చెలక పొలాలు పెట్టుకుని వరి ఎందుకు వేశావు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి రైతును ప్రశ్నించారు.
దీనికి రైతు సొప్పరి ఏసు బదులిస్తూ.. పైన కేసీఆర్ (kcr) , ఇక్కడ మీరు, ఎంఎల్ఏ వున్నారన్న దైర్యంతోటే వేశామయ్యా అని చెప్పాడు. పైన కేసీఆర్ సార్ ఉన్నారు.. అందరూ ఆ ధైర్యంతోటే వేస్తున్నారు కానీ అధిక ఆదాయం వచ్చే పంటలు లాభదాయకంగా ఉంటాయి కదా అని మంత్రి సూచించారు. దీనికి ఏ మాత్రం తడుముకోకుండా కూరగాయలు వేశామని.. దొండకాయలు, సొరకాయలు, కాకరకాయలు పండించామని ఏసు చెప్పాడు.
రోజుకు 1000 నుండి 1500 సంపాదిస్తున్నామని ఆ రైతు తెలిపాడు . అంతేకాదు రెండు పశువులు, రెండు బర్రెలు కుడా ఉన్నాయి అయ్యా అంటూ మంత్రి జగదీష్ రెడ్డికి వివరించాడు. అయితే కూరగాయల మీద దృష్టి సారించాలని.. పశువులు ఉన్నాయి కాబట్టి అరఎకరంలో చొప్ప పెడితే ఏడాదికి 8 సార్లు కోసుకోవొచ్చని రైతుకు మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య నడిచిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"
