ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాలు సురభి వాణీ దేవి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయన్నారు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పరిగి, తాండూరు, మహబూబ్ నగర్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్‌ను కలవలేదని అక్కడి వారు చెబుతున్నారని మంత్రి తెలిపారు.

రాంచందర్‌రావు పట్టభద్రులను చిన్న చూపు చూశారని హరీశ్ రావు ఆరోపించారు. 2018లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేశారని, అంటే గెలిస్తే మధ్యలో ఈ పదవి వదిలి వెళ్లిపోయేవాడు కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్న చూపని హరీశ్ ఎద్దేవా చేశారు. పట్టబధ్రులకు సేవ చేయాలని అనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఎందుకు పోటీ చేసినట్లని మంత్రి నిలదీశారు.

ఇప్పుడు ఓటు వేసి గెలిపిస్తే.. మళ్లీ మధ్యలో వదిలి వెళ్లిపోవన్న గ్యారంటీ ఏంటంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. సురభి వాణి మాజీ ప్రధాని పీవీ కూమార్తెగా, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని ఆయన వెల్లడించారు.

అలాగే విద్యావేత్త, అని విద్యారంగంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి అని హరీశ్ ప్రశంసించారు. లెక్చరర్‌గా, ఫ్రోఫెసర్‌గా, కరస్పాండెంట్‌గా లక్షల మంది పట్టభద్రులను వాణీదేవీ సమాజానికి అందించారని మంత్రి కొనియాడారు.