కేంద్ర హోంమంత్రి, అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు ఆయనను వలస పక్షితో పోల్చుతూ సెటైర్లు వేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) రాష్ట్ర పర్యటనపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత (trs) హరీశ్‌రావు (harish rao) సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయని పేర్కొన్న హరీశ్ రావు.. ఆయా ప్రాంతాల్లో లభించే ఆహారాన్ని ఎంజాయ్ చేస్తాయని చెప్పారు. ఆ తర్వాత అక్కడే గుడ్లు పెట్టి తిరిగి తమ ప్రాంతాలకు హ్యాపీగా వెళ్లిపోతాయన్నారు. ఇక ఈ రోజు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం (WorldMigratoryBirdDay) కావడం కూడా యాధృచ్చికమని హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతకుముందు శుక్రవారం అమిత్ షాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష అలానే ఉందని మంత్రి ఆరోపించారు. కేందం కడుపునింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైరయ్యారు. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి.. పత్తా లేకుండా పోవుడు కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు (gujarat) మాత్రం ఇవ్వని హామీలను ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు.
ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని.. మరోసారి తెలంగాణ గడ్డ మీద అమిత్ షా అడుగుపెడుతున్న వేళ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతోపాటు, వాటి కోసం తెగేదాక కొట్లాడటం మా భాద్యత అని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే... తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక కీలక అంశాలు మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
