దేశవ్యాప్తంగా నేటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు నేటి నుంచి వ్యాక్సినేషన్ (COVID vaccination for children) ప్రక్రియ ప్రారంభం అయింది. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా నేటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు నేటి నుంచి వ్యాక్సినేషన్ (COVID vaccination for children) ప్రక్రియ ప్రారంభం అయింది. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన హరీష్ రావు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. మనదేశంలో, తెలంగాణలో కూడా కేసులు పాజిటివిటీ రేటు పెరుగుతుందని తెలిపారు.
బూస్టర్ డోసులు, పిల్లలకు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతువచ్చామని అన్నారు. ఈ మధ్యే కేంద్రం పిల్లలకు వ్యాక్సిన్‌లు వేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. వ్యాక్సిన్ తీసుకునే పిల్లలు భయపడాల్సిన పనిలేదన్నారు. పెద్ద రాష్ట్రాల్లో 100 శాతం తొలి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అర్హులైన పిల్లలు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇస్తున్నామని.. నాలుగు వారాల తర్వాత పిల్లలు సెకండ్ డోస్ వేయించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణలో పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం 1,014 సెంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం జీహెచ్‌ఎంసీ, 12 మున్సిపల్ కార్పొరేషన్ పరిధుల్లో టీకా తీసుకోవడానికి అర్హులైన పిల్లలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మిగిలిన చోట్ల నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకొచ్చన్నారు. హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పినట్టుగా తెలిపారు. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలో వైద్య సిబ్బంది పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్టుగా చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచిచారు. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, కాలేజ్ ఐడీ కార్డ్ ఉన్నా టీకాల వేయించుకోవచ్చని అన్నారు.
వేలాది మంది ఒక చోటుకు వచ్చి ఇబ్బంది పడకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని హరీష్ రావు చెప్పారు. పిల్లలకు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇచ్చేలా చూస్తున్నామని చెప్పారు. నాలుగైదు రోజులు పరిశీలించిన తర్వాత అవసరమైతే వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచుతామని చెప్పారు. కాలనీలకు కూడా సిబ్బందిని పంపుతామని తెలిపారు. ఒకవేశ రద్దీ లేకుంటే ఓపెన్ వాక్ ఇన్‌ను కూడా తీసుకోస్తామని వెల్లడించారు. జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి టీకాలు వేయనున్నామని చెప్పారు. కాలేజీలు, స్కూళ్ల ప్రిన్సిపాల్లకు టీకాలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఇక, తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయసువారు 22,78,683 మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వ్యాక్సినేషన్ కోసం జీహెచ్‌ఎంసీ, 12 మున్సిపల్ కార్పొరేషన్ పరిధుల్లో టీకా తీసుకోవడానికి అర్హులైన పిల్లలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4.5 లక్షల మందికి టీకాలు వేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పిల్లలు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చిన టీకా పొందడానికి అవకాశం కల్పించారు. ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. టీకా పొందిన తర్వాత అరగంట పాటు టీకా కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్‌పై స్పందించిన మంత్రి హరీష్ రావు..
సూర్యాపేట మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ రోజు ఉదయమే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ రోజు మధ్యాహ్నం లోపు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా చెప్పారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
