గద్వాల: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు పది లక్షలు వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హరీష్ రావు తెలిపారు. మహిళలకు సబ్సిడీ మీద రుణాలు ఇప్పిస్తామని హరీష్ హామీ ఇచ్చారు. మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ మనిషికి 6కేజీల బియ్యం ఇచ్చామని తెలిపారు. లంబాడీ తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. గద్వాల జిల్లా ఏర్పడింది అంటే అది కేసీఆర్ వల్లేనని మంత్రి హరీష్ తెలిపారు. 

గద్వాల జిల్లాను ఏర్పాటు చేశామని చెప్తున్న కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మెుద్దని సూచించారు. గద్వాల నియోజకవర్గంలో రూ.70కోట్లతో 350 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 

మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల జిల్లాను ఎందుకు ఏర్పాటు చెయ్యలేదని మాజీమంత్రి డీకే అరుణను హరీష్ ప్రశ్నించారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో సన్నిహితంగా ఉన్న డీకే అరుణ గద్వాల జిల్లాను ఎందుకు ఏర్పాటు చెయ్యలేదన్నారు. గద్వాల అభివృద్ధికి ఏనాడైనా పాటుపడ్డారా అంటూ మండిపడ్డారు.   

రైతు బంధు పథకం ద్వారా ప్రతీ రైతుకు ఎకరానికి రూ.8000 ఇచ్చి పెట్టుబడి కింద సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎకరానికి 10వేల రూపాయలు ఇచ్చి రైతుల పెట్టుబడికి ఊతమిస్తామని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారని అలాగే కళ్యాణ లక్ష్మీ పథకాన్ని కూడా రద్దు చేస్తామంటున్నారని వారిని ఇంటికి పంపాలని తెలిపారు. ప్రజలు అడగకుండానే 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలను రద్దు వద్దు అంటుందని అలాంటి ప్రభుత్వం మాకొద్దంటూ ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఎనిమిది నెలల్లో ఆర్డీఎస్ కు నీళ్లు ఇచ్చామన్నారు. ఆర్డీఎస్ పూర్తి చేసి 87,500 ఎకరాలకు సాగునీరందింస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు నీళ్లతో ఓ రైతు మంత్రి హరీష్ రావు కాళ్లు కడిగారు. 

కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్ పోరాటం చేశాడని ప్రాణాలను సైతం పణంగా పెట్టారని తెలిపారు. ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. అలాగే జిల్లాలు ఏర్పాటుచేస్తామన్నారు అలాగే 31 జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు. 

భవిష్యత్ లో గద్వాల జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని హరీష్ తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించి కేసీఆర్ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు.