తెరాస మిత్రపక్షం ఎంఐఎం  శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసారు. గాంధీ ఆసుపత్రి కన్నా జైలు బెటర్ అని వ్యాఖ్యానించారు. అక్కడ కరోనా వైరస్ కి చికిత్స పొందినవారు అక్కడి పరిస్థితులు తనకి వివరించారని, అక్కడి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆయన అన్నారు. 

గాంధీలో పేషెంట్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తనకు వివరించారని, ఆహరం మొదలు పారిశుధ్యం, వసతులు, మందులు కూడా సక్రమంగా ఇవ్వడంలేదని తన దృష్టికి వచ్చిందని, అనేక ఫిర్యాదులు కూడా అందాయని అక్బరుద్దీన్ అన్నారు. 

కేవలం సామాజిక దూరం, భౌతిక దూరం పాటిస్తే ఈ వైరస్ దూరమవదని, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఈ మహమ్మారి నుండి బయటపెడతామని ఆయన అభిప్రాయపడ్డారు. 

వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో... మన చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే అన్ని విధాలుగా మెరుగైన ఫలితాలు అందుతాయని అన్నారు. ఇక తెలంగాణాలో మరిన్ని క్వారంటైన్ కేంద్రాలను, కోవిడ్ చికిత్స కేంద్రాల ఏర్పాటును గురించి చెబుతూ... సెక్రటేరియట్ ను కూడా కరోనా వైరస్ చికిత్స కోసం వాడుకోవచ్చని ఆయన అన్నారు. 

గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కోవిడ్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడం పై ఆయన హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో టెస్టింగును మరింతగా ఎక్కువగా చేయాలనీ, అప్పుడు మాత్రమే ఈ కరోనా మహమ్మారిని మనం అరికట్టగలమని ఆయన అన్నారు. 

కరోనా వైరస్ కేసులు గనుక పెరిగి పరిస్థితి చేయిదాటిపోయే స్థితికి గనుక చేరుకుంటే.... ఓవైసీ గ్రూపుకు చెందిన ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు ఈ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. 

తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 970కి చేరుకుంది. తాజాగా రాష్ట్రంలో ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు చేరుకుంది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయినవాళ్ల సంఖ్య 262 ఉంది. 

గత 24 గంటల్లో నమోదైన 27 కేసుల్లో హైదరాబాదులోనే 13 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై సమీక్ష చేస్తున్నామని ఆయన చెప్పారు.