తెలంగాణ ఎన్నికల్లో తమ మద్ధతు కేసీఆర్‌కేనని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్‌ డివిజిన్‌లో ఆయన బహిరంగసభలో ప్రసగించారు.

‘‘లేని మామ కన్నా.. గుడ్డి మామ నయం ’’ అన్నట్టు తాము టీఆర్ఎస్‌కు మద్ధతిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. స్టీరింగ్ మన చేతుల్లోనే ఉంటుందని... కారులో కూర్చొని హాయిగా తిరిగిరావాలని, కారుకి మజ్లిస్ ఇంజిన్ లాంటిదన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని విజయవాడ నుంచి చంద్రబాబు కంట్రోల్ చేస్తారా అని అసదుద్దీన్ విమర్శించారు. అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్, టీడీపీ పొత్తు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం 8 స్ధానాల్లో పోటీ చేస్తోందని... మజ్లిస్ బరిలో లేని చోట టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఙప్తి చేశారు.

ముస్లిం రిజర్వేషన్లకు మోడీ, రాహుల్ అడ్డుపడుతున్నారని.. మైనారిటీల అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్‌కు ఓటేయ్యాని ఒవైసీ ప్రజలను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 236 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 50 వేల మందికి పైగా విద్యార్ధులు చదువుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్  నియోజకవర్గ మజ్లిస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.