సిరిసిల్లలో దారుణం జరిగింది. మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని చిన బోనాలు ప్రాంతంలో లక్ష్మీ అనే మానసిక వికలాంగురాలు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

దంపతులిద్దరు కూలి పనులకు వెళ్లడం.. ఇంట్లో యువతి ఒక్కటే ఉండటంతో రాజు అనే యువకుడు, మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దినెలల తర్వాత యువతి శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు.. బాధితురాలిని దగ్గరలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

యువతిని పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భం దాల్చినట్లుగా నిర్థరించారు. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం... లక్ష్మీ బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడ మృతశిశువును ప్రసవించింది.

కొద్దిసేపటి తర్వాత ఆమెను గమనించిన తల్లిదండ్రులు వెంటే సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో పోలీసులు.. బాలల సంరక్షణ అధికారుల సాయంతో ప్రైవేట్ ఆసుపత్రికి బాధితురాలిని చేర్పించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీపై అత్యాచారానికి పాల్పడిన రాజు ఆచూకీ లభించిందని త్వరలోనే అతనిని అరెస్ట్ చేస్తామని  తెలిపారు.