పాపం... మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  కామంతో కళ్లు మూసుకుపోయి పట్టపగలే  యువకుడు అభం శుభం తెలియని యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువకుడి వికృత చేష్టలను తట్టుకోలేక యువతి అరవడంతో కుటుంబ సభ్యులు వచ్చి నిందితున్ని పట్టుకున్నారు. ఈ దారుణ సంఘటన మహబుబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబుబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో ఓ మతిస్థిమితం లేని యువతి కుటుంబంతో కలిసి జీవిస్తోంది. యువతి కుటుంబసభ్యులు పనులపై బయటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా వుండేది. ఆమె ఆరోగ్యపరిస్థితి, ఒంటరితనాన్ని అదునుగా చేసుకుని అదే గ్రామానికి చెందిన కొంపెల్లి వెంకన్న అనే యువకుడు పట్టపగలే అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తమ కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.