జనాలను అప్పటివరకు తమ ఫన్నీ మీమ్స్ ద్వారా నవ్వించిన ఇద్దరు కుర్రాళ్ళు ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తరువాత అదే జనాలు జీవనాధారం కోల్పోయి దయనీయ స్థితిలో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. జనాలు నవ్వుకునే హాస్యం కన్నా, బాధతో కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లో చిన్న చిరునవ్వును తీసుకురావాల్సి ఉందన్న అవసరాన్ని గుర్తించి దాదాపుగా 50 జీవనాధారాలను కోల్పోయిన కుటుంబాలకు తామున్నామని అండగా నిలిచి సహాయం చేసారు. 

వారే నాయిని అనురాగ్ రెడ్డి, సచిన్ వికాస్. డిపివిఈయూ (దిస్ పేజ్ విల్ ఎంటర్టైన్ యూ ) అనే మీమ్ పేజీని రన్ చేసే ఈ కుర్రాళ్ళు తమ అదే పేజీ ద్వారా జనాలకు చేరువై వారికి వీలైనంత సహాయం చేసారు. అప్పటివరకు ఫన్నీ మీమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ పేజీ ఈ సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ హెల్ప్ లైన్ గా మారిపోయింది. 

24 సంవత్సరాల అనురాగ్ ఐబీఎస్ లో ఎంబీఏ చదువుతుండగా, 29 సంవత్సరాల సచిన్ ఎయిర్ ఫోర్స్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. 10 సంవత్సర క్రితం తెలుగులో మీమ్ కల్చర్ కి తమ పేజీ ద్వారా ఆద్యం పోసింది వీరే..! అదే పేజీ ద్వారా ఇప్పుడు సహాయం కోసం అర్థించిన వారందరికీ... ఒక ట్రయాజ్ పద్ధతి మాదిరిగా తమకు వీలైనంత మందికి సహాయం చేసారు. 

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పీఎం రిలీఫ్ ఫండ్ కి, రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి తమ శక్తి మేర డబ్బును డొనేట్ చేసారు వీరు. కానీ సెకండ్ వేవ్ ప్రారంభమవడంతోనే వారి సబ్ స్క్రైబర్ల లోనే సహాయం కోసం అర్థిస్తున్న వారు కనిపించారు.

సెకండ్ వేవ్ తీవ్రతను అర్థం చేసుకున్న ఇద్దరూ తాము చేసే సహాయం ప్రజలకు నేరుగా అందేలా ఉండి వారికి ఖచ్చితంగా సహాయపడేదిగా ఉండాలని నిర్ణయించుకొని ఇలా జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు నెలకు సరిపడా అవసరమైన నిత్యావసరాలను అందించడం మొదలుపెట్టారు. 

ప్రతి ఒక్క రిక్వెస్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతే సహాయం చేసారు వీరు. సహాయం కావాలని ఎవరైనా మెసేజ్ పెడితే, దాన్ని వెరిఫై చేసిన తర్వాత దగ్గర్లోని చిన్న లోకల్ కిరానా షాపుకి వెళ్లి కొని బిల్లు పంపించమని, ఆ తరువాత వారు నేరుగా ఆ షాప్ ఓనర్ కి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇలా చేయడం వల్ల వ్యాపారం సరిగా సాగని చిన్న షాపు యజమానులు కూడా లాభపడతారు కదా అంటున్నాడు అనురాగ్. ఈ ఆపత్కాలీన సమయంలో మీరు చేసిన సహాయం వల్ల నా కొడుకు వాళ్ళ అమ్మ కన్నా మిమ్మల్నే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు అని ఒక చంటి పిల్లాడి తండ్రి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడంటే వీరు చేసిన సహాయం ఎంత అత్యవసరమైనదో మనము అర్థం చేసుకోవచ్చు. 

ఇంతకుముందు దాదాపుగా 10 మంది కంటెంట్ క్రియేటర్స్ తో రోజుకి మూడు నాలుగు గంటలు తమ పేజీ మీద సమయాన్ని వెచ్చించే ఈ టీం ఇప్పుడు రోజుకి 8 గంటలకు పైగా తమ పేజీకి వచ్చే రిక్వెస్టులు పరిశీలించి వారి అవసరాలను తీర్చడానికి వెచ్చిస్తున్నారు. ఈ కుర్రాళ్ళ పనితనం నచ్చి ఒకిద్దరు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా వీరికి సహాయం చేసారు.

మూడుపదుల వయసు కూడా లేని ఇద్దరు యువకులు తమ అవసరాల కోసం దాచుకోవాల్సిన డబ్బును సమాజం కోసం వెచ్చించడం నిజంగా అభినందనీయం, ఈ యువకుల పనితనం ఎందరికో ఆదర్శవంతం..!