హైదరాబాద్: డాక్టర్ వృత్తిలో ఉండి కూడ తన అమ్మమ్మను బతికించుకోలేకపోయానని ఓ వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన ఒడిలోనే  అమ్మమ్మ మృతి చెందిందని ఆమె కన్నీళ్లు పెట్టుకొంటుంది. హైద్రాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకంది. హైద్రాబాద్ అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆసుపత్రిలో  డాక్టర్ హిమజ పనిచేస్తోంది. ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన కరోనా రోగులకు ఆమె చికిత్స చేసింది.  కూకట్‌పల్లిలో నివాసం ఉండే తన అమ్మమ్మ మీనాక్షి తీవ్ర అస్వస్థతకు గురైంది. మంగళవారం నాడు ఉదయం పదకొండున్నర గంటలకు కింగ్ కోఠి ఆసుపత్రికి అమ్మమ్మను ఆమె ఆటోలో తీసుకొచ్చింది. ఆసుపత్రి  బయటే  ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ నుండి మీనాక్షికి ఆక్సిజన్ పెట్టారు. 

ఈ సమయంలో హిమజ ఆసుపత్రిలో ఆడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రిజిస్ట్రేషన్ రూమ్ వద్ద చెప్పి స్లిప్ తీసుకొంది. ఆడ్మిషన్ ప్రక్రియ చేసే సిబ్బంది వద్దకు వచ్చి ఆ స్లిప్ ఇచ్చింది. ఆ సమయంలో ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ చూస్తే 42కి పడిపోయాయి.  దీంతో ఎమర్జెన్సీ కేసు అంటూ ఉస్మానియాకు రెఫర్ చేశారు.ఉస్మానియా ఆసుపత్రి ఆవరణకు చేరుకోగాను ఆటోలోనే తన అమ్మమ్మ తన ఒడిలోనే తుదిశ్వాస విడిచిందని హిమజ కన్నీళ్లు పెట్టుకొంది. డాక్టర్ గా ఉన్న తాను  అమ్మమ్మను బతికించుకోలేకపోయానని ఆమె ఆవేదన చెందుతోంది.ఆసుపత్రి వద్దకు వచ్చాం.. నీకేం ఇబ్బంది లేదు అంటూ భరోసా ఇచ్చి కూడా తాను ఆమెను కాపాడుకోలేకపోయినట్టుగా హిమజ వాపోతున్నారు.