హైదరాబాద్ వర్షాల మీద మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వాపోయారు. నగరంలో గతేడాది నగరంలో వందేళ్లలో ఎన్నడూ కురవనంత భారీ వర్షాలు పడ్డాయని, అలాంటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడ్ని కోరుకుంటున్నానని చెప్పడమే తన ఉద్దేశమంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 

తాను చెప్పిన దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావొద్దన్నదే తన ఉద్దేశం తప్ప, అస్సలు వర్షాలు రావొద్దని కోరుకోవడం కాదన్నారు. 

ఐదేళ్లపాటు వర్షాలు పడొద్దు దేవుడా.. వైరలవుతున్న మేయర్ వ్యాఖ్యలు..

ఈ మధ్య ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవలి వానలకు నగరం అతలాకుతలం అయిన పరిస్థితిని గుర్తుచేస్తూ అలాంటి పరిస్థితి వస్తే మీరేం చేస్తారు అని ఓ ప్రశ్న అడిగారు. దీంతో ఆమె వెంటనే తడుముకోకుండా ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని దేవుణ్ని కోరుకుంటున్నా అన్నారు. 

దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తాజాగా విజయలక్ష్మి వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు షేక్ పేట్ తహసీల్దార్ బదిలీ విషయంలో తన  ప్రమేయం ఉందన్న వార్తలమీద క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. 

ఆ విషయం తాను ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు. అంతేకాదు తహసీల్దార్ తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని మీడియా ముందు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వ్యవహారమని దీంట్లో తనకు ఎలాంటి పాత్ర లేదని చెప్పుకొచ్చారు.