హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ పై చేయి సాధించింది. కాగా.. త్వరలోనే మేయర్ పదవి ఎవరికి కట్టపెట్టాలనే విషయంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలువురు భేటీలు ఆసక్తికరంగా మారాయి.

మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఆయన సతీమణి, చర్లపల్లి తాజా కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవీయాదవ్‌ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ నెల 11న కొత్త పాలకమండలి కొలువు దీరనున్న నేపథ్యంలో వారు కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేయర్‌ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తోన్న తరుణంలో ప్రస్తుత మేయర్‌ ప్రగతిభవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.  మరోసారి మేయర్ పదవి దక్కించుకునేందుకే బొంతు సీఎంని కలిశారా అనే చర్చ మొదలైంది. కాగా..  ఇప్పటి పాలకమండలి గడువు 10వ తేదీతో ముగియనుంది.

ఇదిలా ఉంటే.. అమావాస్య రోజు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముహూర్తం పెట్టిన నేపథ్యంలో పాలకమండలి ఏర్పాటు ఉంటుందా..? ప్రత్యేక అధికారి పాలన సాగుతుందా..? అన్న దానిపై ఇప్పటికీ బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినా.. సభ్యులకు ప్రత్యేక సమావేశం వర్తమానం పంపుతున్నా.. కౌన్సిల్‌ ఏర్పాటుపై సందేహాలు సజీవంగానే ఉన్నాయి.