యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద జరిగిన  రోడ్డు ప్రమాదం  ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వృద్దురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మృతురాలి డెడ్‌బాడీతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది.


చౌటుప్పల్:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.దండుమల్కాపురం గ్రామానికి చెందిన యాదమ్మ అనే వృద్దురాలు కరోనా టీకా కోసం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

వృద్దురాలిని మృతిని నిరసిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై డెడ్‌బాడీతో ఆందోళనకు దిగారు. అండర్‌పాస్ లేని కారణంగా ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని స్థానికులు ఆందోళన చేశారు. జాతీయ రహదారిపై ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆందోళనకారులతో చౌటుప్పల్ ఏసీపీ శంకర్ చర్చించారు. దీంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. గతంలో కూడ ఇదే ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. తమ గ్రామానికి అండర్ పాస్ నిర్మించాలని చేసిన వినతిని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అండర్ పాస్ నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.