భర్తని కాదని.. ఓ వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో తన భర్త తండ్రి(మామ) అడ్డుగా ఉన్నాడని... ప్రియుడితో కలిసి అతనిని దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన బీర్కూర్ విఠల్ కి కొన్ని సంవత్సరాల క్రితం లావణ్య అనే యువతితో వివాహం జరిగింది. భర్తను అమాయకుడిని చేసిన లావణ్య పక్కింటి రాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

లావణ్య పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని విఠల్ తండ్రి గంగారాం(60) గమనించాడు. ఈ విషయంలో కోడలు లావణ్య ని, పక్కింటి రాజుని గట్టిగా మందలించాడు. తమ మామ బ్రతికి ఉంటే.. ప్రియుడితో రాసలీలలు జరపడం కష్టమని భావించిన లావణ్య.. అతనిని చంపేందుకు పథకం వేసింది.

పథకం ప్రకారం ఈ నెల 22వ తేదీన నిద్రిస్తున్న గంగారాంని లావణ్య ప్రియుడు రాజు కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సంఘటనా స్థలంలో రాజు మెడలో చైన్ అక్కడ పడిపోయింది. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. లావణ్య, రాజులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

లావణ్యకి ఇద్దరు పిల్లలు ఉండగా... రాజుకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాలు వీధినపడ్డాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.