హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పిల్లలను కట్టేసి, వారి ముందే తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. వివరాల్లోకి వెళితే.. జల్‌పల్లి వాదే ముస్తఫా బస్తీకి హర్యానా నుంచి షాకీర్‌ఖాన్ కుటుంబం వలస వచ్చింది.

షాకీర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివసిస్తున్నారు. ఈ క్రమంలో షాకీర్ శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లడంతో భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంది.

దీనిని గుర్తించిన బంధవులు అజాద్, అంజాద్‌లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో షాకీర్ ఇంటికి వచ్చారు. మంచినీరు అడగటంతో ఆమె నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది.

ఆ లోపు వెనుక నుంచి ఆమెను బంధించారు. నలుగురు పిల్లలను మరో వ్యక్తి పక్క గదిలో ఉంచి గడియ పెట్టాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. అర్థరాత్రి విధులు ముగించుకుని వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని తెలిపింది.

దీంతో అతడు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అత్యాచార ఘటన జరిగిన ప్రాంతం హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సరిహద్దుగా ఉండటంతో ఇరు కమిషనరేట్ల అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇది తమ పరిధి కాదంటూ అధికారులు సతమతమయ్యారు. చివరికి పహాడీషరీఫ్ పోలీసులే కేసు నమోదు చేశారు.