నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి శివారులోని గుట్ట ప్రాంతంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమెను 22 ఏళ్ల యండాల రాధగా గుర్తించారు. 

తలపై బండరాయితో మోది, ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేసిన ఆనవాళ్లు కనిపిస్తన్నాయి. కాగా, నవీపేట మండలం శివతండా గ్రామానికి చెదిన మృతురాలి భర్త బానోత్ రాము ఇంటి ఆవరణలో రాధకు చెందిన చెప్పులు, దుస్తులు కాల్చివేసిన ఆనవాళ్లు కనిపించాయి. 

దాంతో రాధను ఆమె భర్త, కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అర్థవీడు గ్రామానికి చెందిన రాధను రాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు హైదరాబాదులో ఉంటూ వచ్చారు. 

రెండు నెలల క్రితం తన భార్య రాధతో కలిసి రాము స్వగ్రామానికి వచ్చాడదు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వచ్చాయని పోలీసులు అంటున్నారు.