మంచిర్యాల: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో కేంద్ర సూచనలను సైతం పక్కనబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సండలించేది లేదని తేల్చిచెప్పింది. ఇలా ప్రభుత్వం, పోలీసులు ఓవైపు కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇలా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు బావిస్తున్నారు. 

మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ నుండి ఇద్దరు కరోనా అనుమానితులు పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబట్టారు. ఈ ఘటన జిల్లాలోని జైనూర్ మండలం రాసిమెట్ల క్వారంటైన్ సెంటర్‌‌లో చోటు చేసుకుంది. ఇక్కడ క్వారంటైన్ లో వున్న ఇద్దరు అనుమానితులు సిబ్బంది కళ్లు గప్పి గోడ దూకి సెంటర్ ‌నుంచి పరారయ్యారు. 

ఈ విషయం తెలుసుకున్న అక్కడి సిబ్బంది స్థానిక సమాచారం అందించారు. దీంతో పోలీసులు రాత్రంతా జల్లెడపట్టి వారిని పట్టుకున్నారు. వీరిద్దరి పైనా పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. పరారైన వారిలో ఒకరు పోస్టల్ ఉద్యోగి ఉన్నట్లుగా  తెలుస్తోంది.  

కేంద్రం సూచించినప్పటికి తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఎలాంటి లాక్‌డౌన్‌ మినహాయింపులు లేవన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ ఉంటుందని చెప్పారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 651 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పడుతోందన్నారు. వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తిలో జీరో కరోనా కేసులు నమోదయ్యాయని కేసీఆర్ ప్రకటించారు.

కరోనా కేసుల విషయంలో మే 1 తర్వాత ఊరట కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మే 7 వరకు గతంలో ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయన్నారు. పలు టీవీ ఛానెళ్లు నిర్వహించిన సర్వేలో లాక్‌డౌన్ పొడిగించాల్సిందిగా 92 శాతం మంది అభిప్రాయపడ్డారని కేసీఆర్ గుర్తుచేశారు. మే 5న మరోసారి రాష్ట్ర కేబినెట్ సమావేశమవుతుందని అప్పుడున్న పరిస్ధితులపై చర్చిస్తుందని సీఎం తెలిపారు.