తనను గతంలో జైలుకి పంపించిందనే కోపంతో ఓ వ్యక్తి మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన రాహుల్‌గౌడ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతడికి గుర్రంగూడలో ఉంటున్న రవికుమార్, విమల దంపతులతో పరిచయం ఏర్పడింది. తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్లే రాహూల్‌  కొంత కాలంగా విమలను వేధిస్తున్నాడు. భర్తను వదిలేసి వస్తే తాను వివాహం చేసుకుంటానని బలవంతం చేస్తున్నాడు.

రాహుల్‌ వేధింపులు తాళలేక విమల  గత  డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు జైలుకు పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రాహుల్‌ విమలను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం వారి ఇంటికి వచ్చిన రాహుల్‌ ఆమెపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని సీఐ తెలిపారు.