Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో పాల్వంచ తరహా దారుణం... టీఆర్ఎస్ నేత చేతిలో మోసపోయానంటూ సొంత తమ్ముడి సెల్పీ సూసైడ్ (Video)

తోబుట్టువుల చేతిలోనే మోసపోవడాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. 

Man takes selfie video while committing suicide in Karimnagar
Author
Karimnagar, First Published Jan 20, 2022, 1:36 PM IST

కరీంనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (kothagudem district)లో అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ఎమ్మెల్యే తనయుడి ఆగడాలకు ఓ కుటుంబం బలయిన ఘటన మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. టీఆర్ఎస్ నాయకుడైన సొంత అన్నే తన ఆస్తిని కాజేసాడంటూ ఓ బాధితుడు సెల్పీ వీడియో (selfie suicide) తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42)కి సోదరుడు, సోదరితో ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. ఆస్తిలో తనకు రావాల్సిన వాటాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడైన  సొంత సోదరుడే కాజేసాడని శ్రీనివాసాచారి ఆవేదన వ్యక్తం చేసాడు. తనకు రావాల్సిన ఆస్తిని అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా లాక్కున్నాడని బాధితుడు ఆరోపించాడు. 

Video

నా ఆస్తిని సోదరుడు తన భార్య పేరిట రిజస్టర్ చేయించుకున్నాడని బాధితుడు తెలిపాడు. అంతేకాకుండా సొంత సోదరి లక్ష్మి కూడా తనను మోసం చేసిందని వాపోయాడు. ఇలా తోడబుట్టిన వారి చేతిలో అన్ని విధాలుగా మోసపోయానని... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు. 

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసాచారి అంతకంటే ముందు ఓ సెల్పీ వీడియో రికార్డ్ చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను ఆ వీడియోలో తెలియజేసాడు. సోదరుడు, సోదరి చేతిలో మోసపోవడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు... తన చావుకు వారే కారణమని శ్రీనివాసాచారి వీడియోలో వెల్లడించాడు. 

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి సెల్పీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి సెల్పీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇదిలావుంటే భద్రాద్రి కొత్తగూడెం (kothagudem) జిల్లా పాల్వంచ (palvancha)లో ఓ కుటుంబ ఆస్తి వివాదంలో తలదూర్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవ (vanama raghava) నీచానికి ఒడిగట్టాడు. తన పెద్దరికాన్ని నిలుపుకోకుండా అతి నీచమైన కోరికను నెరవేర్చాలని బాధితుడు రామకృష్ణను కోరాడు. నీ భార్యను నా వద్దకు పంపిస్తే న్యాయం జరిగేలా చూస్తానని రామకృష్ణను బెదిరించాడు రాఘవ. కట్టుకున్న భార్యను పంపిచమని తననే కోరడంతో తీవ్ర  మనస్థాపానికి గురయిన రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 

మొదట తన ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుపుతూ ఓ సెల్పీ వీడియో, సూసైడ్ లెటర్ రాసిపెట్టి రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.మొదట భార్య, ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ తర్వాత రామక‌ృష్ణ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఓ రాఘవ నీచమైన కోరిక ఓ కుటుంబంమొత్తాన్ని బలిచేసింది. 

తన కుటుంబ ఆత్మహత్యకు కారణాలను తెలుపుతూ రామకృష్ణ తీసుకున్న సెల్పీ వీడియో వైరల్ గా మారడంతో రాఘవపై కేసు నమోదయ్యింది. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భార్య, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన మండిగ నాగరామకృష్ణ (40)ను ఏ1గా చూపారు. ఏ2గా వనమా రాఘవేంద్రరావు, ఏ3గా రామకృష్ణ తల్లి సూర్యవతి, ఏ4గా అక్క మాధవి, తర్వాతి నిందితులుగా రాఘవకు సహకరించిన అనుచరులు ముక్తిని గిరీష్, దావా శ్రీని వాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలను చేర్చారు.

ఇప్పటివరకు రాఘవేంద్ర 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.  రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుల సమాచారం సేకరిస్తున్నామని.. విచారణలో ఉందని వివరాలను వెల్లడించలేమని పోలీసులు చెప్పారు. రాఘవేంద్రకు సహకరించిన నిందితులకు నోటీసులు ఇచ్చామని.. వారు స్పందించకపోతే చట్టప్రకారం చర్యలు చేపడతామని  ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios