హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి  సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే అసెంబ్లీ వద్ద అలజడి చెలరేగింది. ఓ వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో బందోబస్తులో భాగంగా అక్కడే వున్న పోలీసులు అతన్ని కాపాడి హాస్పిటల్ కు తరలించారు. 

ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటూ అతడు పెట్రోల్ పోసుకున్నట్లు తెలిపారు. జై తెలంగాణ అంటూ నినదించడమే కాకుండా... కేసీఆర్ సర్ న్యాయం చేయమని బాధితుడు అరిచినట్టు తెలిపారు. 

"

ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కడ్తల్ గ్రామానికి చెందిన నాగులుగా గుర్తించారు. అతడు ఓ ప్రయివేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుందని వెల్లడించారు. 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి శరీరం దాదాపు 50శాతం కాలిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగానే వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.