హైదరాబాద్: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి కోర్టు జీవిత కాలం జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. తాగిన మత్తులో కూతురిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ దూరపు బంధువు ద్వారా విషయం బయటకు రావడంతో తండ్రిపై కేసు నమోదైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. 

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి దగ్గరలో గల ఓ కాలనీకి చెందిన వ్యక్తి (40) భార్య మరణించడంతో కూతురితో కలిసి ఉంటున్నాడు మద్యానికి బానిసై 2017లో కూతురిపై అత్యాచారం చేశాడు. బాలిక గర్బం దాల్చడంతో ఓ ప్రైవేట్ వైద్యుని సలహా తీసుకుని ట్యాబ్లెట్లు వేసి గర్భస్రావం చేయించాడు. 

తండ్రి అఘాయిత్యం భరించలేక కూతురు ఓ బంధువుకు విషయం చెప్పింది. దాంతో అతని అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. నేర విచారణ చట్టం సెక్షన్ 164 ప్రకారం పోలీసులు బాధిత బాలిక వాంగ్మూలాన్ని మేడ్చల్ లోని 21వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయించారు 

కేసును విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి సురేష్ నిందితుడికి మరణించేంత వరకు జైల్లో ఉండాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.